దేవుడు
మనసిచ్చినవాడికే మనసు లేదు
మనకిచ్చాడు కానీ పంచుకోలేదు
దేవుడు చేసిన బొమ్మ మనిషయ్యింది
బొమ్మ చేసిన దేవుడు రాయయ్యాడు.
మనస్సుకు మారుపేరు కన్నీళ్ళు
అందుకే దేవుడెప్పుడూ ఏడవడు.
మనిషికి మనిషే తోడు
అందుకే ఒక్కక్కర్నీ విడగోడతాడు
దేవుడిలాగే మనిషీ పుడుతుంది.
కానీ పాశం, బంధం బలపడుతుంది
మనిషికీ మనిషికీ ముడిపెడుతుంది
కాలం ఖర్మం దాన్ని చెడగొడుతుంది
కట్టె మండితే బొగ్గవుతుంది
బొగ్గు మండితే బూడిదవుతుంది
బూడిద మండితే
ఏమౌతుంది ?
లోకమంతా దుఃఖం పరచుకొని ఉంది.
వేరే వేరే రూపాలలో అదే కనబడుతుంది
ఆశలో, ప్రేమలో, గెలుపులో, బ్రతుకులో
అదే దాచుకొని ఉంది, కాచుకొని ఉంది.
ఈ ఏడుపు చూసి దేవుడు
మనకోసం అవతారమెత్తుతాడు
ఈ మనిషి కష్టాలు పడలేక
మళ్ళీ దేవుడైపోతాడు.
అనుభవాల సారం జీవితం
సంబంధాల సమాహారం జీవితం
కాలంతో భాగాహారం మిగిల్చే
శేషం ఒక్క జ్జ్ఞాపకం.
- రసిఖ
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home